కారెక్కిన దానం నాగేందర్
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్లో దానం నాగేందర్ ఆయన అనుచరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు దానం నాగేందర్ తన అనుచరులతో కలిసి ర్యాలీగా బయలుదేరి తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలకు ఆకర్షితుడై టీఆర్ఎస్లో చేరుతున్నట్లుగా దానం ప్రకటించారు. దానం టీఆర్ఎస్లో చేరిక నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద సందడి నెలకొంది. దానం అనుచరులు, టీఆర్ఎస్ కార్యకర్తలతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.













