మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ ఇక లేరు
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ (60) కన్నుమూశారు. కొన్నాళ్లుగా ఆయన కేన్సర్‌తో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. 1959 జులై 1న జన్మించిన ముఖేశ్‌గౌడ్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు సార్లు మంత్రిగా సేవలందించారు. కార్పొరేటర్ స్థాయి నుంచి మంత్రి దాకా అంచెలంచెలుగా ఎదిగారు. గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే ఆయన కొనసాగారు.
1989, 2004లో మహారాజ్‌గంజ్, 2009లో గోషామహల్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. 2007లో వైఎస్ హయాంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించారు. 2009లో కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్‌లో మార్కెటింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు అయిదేళ్లపాటు నిర్వర్తించారు. 20014, 2018లో గోషామహల్ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ చేతిలో ఓటమిపాలయ్యారు. నాటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ముఖేశ్ గౌడ్‌కు ఇద్దరు కుమారులు విక్రమ్ గౌడ్, విశాల్ గౌడ్, ఒక కుమార్తె శిల్ప ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అంత్యక్రియలు ఓ వైపు జరుగుతుండగానే.. ముఖేశ్ గౌడ్ కన్నుమూడయంతో కాంగ్రెస్ పార్టీలో విషాదం నెలకొంది.













