మాజీ మంత్రి చందూలాల్ ఇక లేరు
మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ (66) గురువారం రాత్రి కన్నుమూశారు. కరోనాతో బాధపడుతున్న ఆయన మూడురోజుల కిందట హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఎన్టీఆర్, కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధప్రదేశ్, తెలంగాణలో మంత్రిగా పనిచేశారు. మూడుసార్లు శాసనసభకు, రెండు సార్లు లోక్సభకు చందూలాల్ ఎన్నికయ్యారు. 2014లో ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు నియోజకవర్గం నుంచి గెలుపొంది సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా సేవలందించారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
సర్పంచి నుంచి చందూలాల్ రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. ములుగు నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా, వరంగల్ ఎంపీగా 2 సార్లు గెలుపొందారు. టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. చందూలాల్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మంత్రిగా గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. చందూలాల్ మృతి పార్టీకి తీరని లోటని కేసీఆర్ అన్నారు. చందూలాల్ మృతి పట్ల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందూలాల్ మృతి గిరిజనులకు తీరని లోటని రాష్ట్ర గిరిజన, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అభివర్ణించారు. సుదీర్ఘకాలంపాటు గిరిజన నేతగా, గిరిజన సంక్షేమ మంత్రిగా ఆయన చేసిన సేవలు మరువలేనివి అని ఆమె అన్నారు.













