హైదరాబాద్ లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా…
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు భారీ భద్రత ఏర్పాటు చేశారు నగర పోలీసులు. ప్రధానితో పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు రానున్న కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు ప్రత్యేక భద్రత కల్పించనున్నారు. ఇప్పటికే నోవాటెల్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. మోదీ పర్యటన ఉన్నంతసేపు మూడంచెల భద్రత కొనసాగనుంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్, హెచ్ఐసీసీ, రాజ్‌భవన్ చుట్టూ కేంద్ర బలగాలు మోహరించాయి. డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. సుమారు ఐదు వేల మంది పోలీసుతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ ప్రజలకు చేసిందేమీ లేదని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. పరేడ్ గ్రౌండ్స్ పక్కనే ఉన్న టివోలీ థియేటర్ సిగ్నల్ వద్ద ఈ భారీ ఫ్లెక్సీ వెలిసింది.
జులై 3వ తేదీన పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ నేపథ్యంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. నల్లధనం వెనక్కి తెప్పించడం సహా నోట్ల రద్దు, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలు, రైతు చట్టాలు, అగ్నిపథ్ వంటి అంశాలను ఫ్లెక్సీలో ముద్రించారు. బై బై మోదీ అనే హ్యాష్ ట్యాగ్‌తో ఉన్న ఫ్లెక్సీని ఎవరు ఏర్పాటు చేశారన్న దానిపై స్పష్టత లేదు. ఇదే కాకుండా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లోనూ మోదీకి వ్యతిరేకంగా హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల ఏర్పాటుపై సమాచారం అందుకున్న కంటోన్మెంట్ సిబ్బంది వెంటనే పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు.













