సరికొత్త రికార్డు సృష్టించిన గవర్నర్ నరసింహన్
గవర్నర్‌గా నరసింహన్ సరికొత్త రికార్డు సృష్టించారు. 2007 జనవరి 19 నుంచి ఇప్పటి వరకు అంటే 12 సంవత్సరాల 8 నెలల పాటు గవర్నర్‌గా వ్యవహరించారు. ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు సంబంధించి అయిదుగురు ముఖ్యమంత్రులతో పనిచేసి దేశంలో సుదీర్ఘకాలం పనిచేసిన గవర్నర్‌గా గుర్తింపు పొందారు. తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిదిన్నరేళ్లుగా పనిచేసిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి చివరి గవర్నర్‌గా, విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తొలి గవర్నర్‌గా రికార్డు నమోదు చేశారు. యూపీఏ హయాంలో గవర్నర్‌గా నియమితులైన ఆయన ఎన్డీయే ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చాక గవర్నర్‌గా సుదీర్ఘకాలం కొనసాగడం విశేషం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా హరిచందన్ నియామకం జరగగా నరసింహన్ మార్చుతారనే వాదన ఉపందుకుంది. కేంద్రం ఉనికిని చాటేలా తెలంగాణలో పట్టు పెంచుకునే వ్యూహంలో భాగంగా నరసింహన్ మార్పిడి జరిగినట్లు తెలుస్తోంది. కొత్త గవర్నర్ తమిళిసై నియామకం వ్యూహాత్మకమేనని భావిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో నలుగురు సీఎంలతో ప్రమాణం స్వీకారం చేయించిన ఘనత నరసింహన్దే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి, విభజన అనంతరం తెలంగాణ సీఎంగా కేసీఆర్ (రెండుసార్లు), ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, జగన్‌లతో ప్రమాణం చేయించిన ఘనత ఆయనది.













