కరోనాతో మరణించిన….జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం
కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తక్షణ సాయంగా రూ.2 లక్షలు అందించనుంది. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజీ), ఇతర జర్నలిస్టు సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. గత పది రోజుల్లో కరోనా బారినపడి మృతి చెందిన 15 మంది జర్నలిస్టులకు ఆర్థికసాయం కోసం మే 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సూచించారు. మరణ ధ్రువీకరణపత్రము, అక్రిడిటేషన్ కార్డు, కరోనా పాజిటివ్ రిపోర్టులతో పాటు ఆయా జిల్లాల డీపీఆర్వోలు ధ్రువీకరించాల్సి ఉంటుదని తెలిపారు. కరోనా రెండో దశలో వైరస్ పాజిటివ్‌లుగా నిర్థారణ అయిన 200 మంది జర్నలిస్టులకు నేటి నుంచి ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర మీడియా అకాడమీ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు.













