తెలంగాణలో ముగిసిన నామినేషన్ల ఘట్టం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. మొత్తం 119 స్థానాలకు జరుగుతున్న ఈ పోరులో నామినేషన్ల దాఖలుకు సమయం నేడు మధ్యాహ్నం 3 గంటలతో పూర్తయ్యింది. నామినేషస్ దాఖలుకు ఆఖరు కావడంతో పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు, స్వతంత్రులు రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలకు చేరుకున్నారు. దీంతో కోలాహల వాతావరణ నెలకొంది. ఈ నెల 20న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి ఈ నెల 22 వరకు గడువు ఉంది. డిసెంబర్ 7న ఎన్నికల పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 11న ఓట్లను లెక్కిస్తారు. చివరి రోజు పలువురు ప్రముఖులు నామినేషన్ వేశారు. వీరిలో మంత్రులు కేటీఆర్, ఈటల, తుమ్మల, తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు, కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి, రేవంత్రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.













