బీజేపీలో చేరిన తెలంగాణ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు
తెలంగాణ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు సీహెచ్. విఠల్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్‌చుగ్ సమక్షంలో విఠల్‌కు కాషాయ కండువా కప్పి ప్రాథమిక సభ్యత్వాన్ని ఇచ్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ కుమార్ పుష్పగుచ్చం అందించి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విఠల్ మాట్లాడుతూ ఈ రోజు జీవితంలో మరపురాని రోజని అన్నారు. అంబేద్కర్ జయంతి, రామమందిర నిర్మాణం కోసం కరసేవలకు బలిదానం చేసిన రోజున సొంత ఇల్లు బీజేపీకి రావడం సంతోషంగా ఉందన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు తెలంగాణలో ఖాళీ ఉన్నా, ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయడం లేదని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు, మహిళలు, విద్యావంతులకు సరైన గౌరవం లేదన్నారు. 7 ఏళ్ళలో 600 మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారన్నారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని విఠల్ ఆశాభావం వ్యక్తం చేశారు.













