ఇవన్నీ సీఎం కనుసన్నల్లో జరుగుతున్నాయి : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
తెలంగాణ రాష్ట్రంలో గత మూడు నెలలుగా పాలన స్తంభించిందని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కార్యాలయంలో వేలాదిగా దస్త్రాలు ( ఫైల్స్) పేరుకుపోయాయని ఆరోపించారు. టీఆర్ఎస్కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలకు, ఎంపీల ఫోన్ ట్యాప్ చేస్తున్న విషయాన్ని వారు ప్రైవేట్‌గా కలిసినప్పుడు చెబుతున్నారు. చివరికి గవర్నర్ కూడా తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారేమో అనే అనుమానం వ్యక్తం చేశారు. ఇవన్నీ సీఎం కనుసన్నల్లో జరుగుతున్నాయని తెలిపారు.
ఫోన్ల ట్యాపింగ్‌పై ఉన్నత స్థాయి విచారణ జరపాలి. ధరణి పేరుతో భూములను టీఆర్ఎస్ నేతలు మాయం చేస్తున్నారు. నయీం. డ్రగ్స్, ఈఎస్ఐ, మియాపూర్ భూముల కేసుల్లో ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తులు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిని కబంధ హస్తాల్లో పెట్టుకునేందుకే సిట్ ఏర్పాటు చేస్తున్నారు. అభివృద్ధి కార్యాక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్న ప్రధానిని అడ్డుకుంటారా? ప్రధానిని అడ్డుకోవడమంటే అభివృద్ధిని అడ్డుకోవడమే అని అన్నారు. నిజాం షుగర్, ఆజంజాహీ మిల్లును ఎందుకు తెరిపించలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.













