బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీమంత్రి
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కృష్ణయాదవ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్కు రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా కృష్ణయాదవ్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రకటించిన అభ్యర్థుల జాబితా తనకు తీవ్ర నిరాశ కలిగించిందన్నారు. ఆత్మగౌరవంలేని పార్టీలో కొనసాగడం ఇష్టం లేకే పార్టీని వీడుతున్నట్టు తెలిపారు. 2018 నుంచి పార్టీలో ఉన్నప్పటికీ తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్ అని మండిపడ్డారు. భూస్వాములకు, పెత్తం దారులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించలేదని ఆరోపించారు. నాలుగైదు రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్టు తెలిపారు.













