ఇతర నగరాల్లోనూ ‘బస్తీ దవాఖానా’ : ఈటల రాజేందర్
తెలంగాణలోని ఇతర పెద్ద నగరాలకూ బస్తీ దవాఖానాలను విస్తరించే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే 225 బస్తీ దవాఖానాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులడిగిన ప్రశ్నలకు ఈటల సమాధానమిచ్చారు. నగరంలో చాలా బస్తీలున్నాయని, అందులో నివసిస్తున్న పేదవారి కోసం దవాఖానాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఢిల్లీలోని మొహల్లా ఆస్పత్రులను ఆదర్శంగా తీసుకొనే బస్తీ దవాఖానాలకు శ్రీకారం చుట్టామని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే 350 బస్తీ దవాఖానాలను మంజూరు చేశారని, ఈ క్రమంలోనే 10 వేల జనాభా ఉన్న బస్తీల్లో ఈ దవాఖానాలను ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. ఈ బస్తీ దవాఖానాల్లో ఓ డాక్టర్, స్టాఫ్ నర్సుతో పాటు అటెండర్ ఉంటారని, ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకూ బస్తీ దవాఖానాలు పని చేస్తున్నాయని తెలిపారు. వీటి ద్వారా పేదలకు నాణ్యమైన వైద్యం అందుతోందని, ఈ దవాఖానాలు హైదరాబాద్ నగరంలో సక్సెస్ అయ్యాయని, వీటిని మిగితా జిల్లాలకు కూడా విస్తరించే ఆలోచన మాత్రం ప్రభుత్వం వద్ద ఉందని ఈటల వెల్లడించారు.













