ఈటల రాజేందర్ సహా 184 మందికి తప్పిన పెను ప్రమాదం

ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణమైన మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ బృందానికి ఓ పెద్ద ప్రమాదమే తప్పింది. ఆయనతో పాటు 184 మందితో వస్తున్న విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. టర్మినల్ నుంచి ముందుకు వెళ్తూ, కొన్ని క్షణాల్లో టేకాఫ్ అవుతుందనగా సాంకేతిక సమస్యను పైలట్ గుర్తించారు. గాలిలోకి టేకాఫ్ అవకముందే పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదమే తప్పింది. అయితే మరమ్మతులు పూర్తి అవగానే ఆ స్పైస్ జెట్ విమానం తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరింది. ఈ విమానంలో ఈటల రాజేందర్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్, మాజీ ఎంపీ వివేక్, తుల ఉమతో సహా మరో 184 మంది ఆ విమానంలో ఉన్నారు. రన్‌వేపై ఉండగానే పైలట్ ఈ సాంకేతిక సమస్యను గుర్తించడంతో ఆ 184 మందికి పెను ప్రమాదమే తప్పింది.
సోమవారం ఈటల రాజేందర్‌తో సహా మరో 184 మంది బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ ఛుగ్ ఈటలను పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత ఈటల బృందం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని, హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతున్న సమయంలో ఈటల బృందానికి ఈ పెను ప్రమాదం తప్పింది.