అసెంబ్లీ ఎన్నికలకు రిహార్సల్ హుజూరాబాద్ ఉప ఎన్నిక : ఈటల

బీజేపీలో చేరిన తర్వాత మొట్టమొదటి సారిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు. ప్రజలు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చి, స్వాగతం పలికారు. హుజూరాబాద్, జమ్మికుంట మండలాల్లో ఈటల రోడ్‌షో నిర్వహించారు. ఆయన భార్య జమున కూడా మరికొన్ని ప్రాంతాల్లో పర్యటించి, ప్రజలు, కార్యకర్తల మద్దతు కోరారు. హుజూరాబాద్ లో కచ్చితంగా బీజేపీ జెండా ఎగురుతుందని ప్రకటించారు. తెలంగాణలో బడుగు బలహీన వర్గాల ఆకాంక్షలు ఏమాత్రం నెరవేరలేదని, ఆ ఆకాంక్షలను నెరవేర్చడమే బీజేపీ లక్ష్యమని ప్రకటించారు. 2023 లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు రిహార్సల్‌గా హుజూరాబాద్ ఉప ఎన్నిక అని అభివర్ణించారు. టీఆర్ఎస్ అహంకారానికి కచ్చితంగా ఘోరీ కడతామని, తనకు మద్దతిచ్చే కార్యకర్తలను వేధిస్తే ఎంత మాత్రమూ ఊరుకోమని హెచ్చరించారు. శుక్రవారం నుంచి నియోజకవర్గంలో మూడు రోజుల పాటు పర్యటిస్తూ, ఇంటింటికి వెళ్లి, ప్రజల ఆశీర్వాదం కోరుతానని ఈటల ప్రకటించారు.