తెలంగాణలో ప్రైవేటు ఆసుపత్రుల లైసెన్స్ లు రద్దు?
ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో పలు ప్రైవేటు ఆసుపత్రుల లైసెన్స్ రద్దు దిశగా ప్రభుత్వం సిద్ధమైంది. కరోనా వ్యాధి వ్యాప్తిని ఉయోగించుకుని పాజిటివ్ గా తేలిన వారిని దోచుకుంటున్న కార్పొరేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీపై వస్తున్న మీడియా కధనాలు విషయంలో పెద్దగా స్పందించని ప్రభుత్వం.. ఈ విషయంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగానికి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఉలిక్కిపడింది. ఏకంగా 1000కు పైగా ఫిర్యాదులు ప్రైవేటు ఆసుపత్రులపై రావడం ప్రభుత్వంలో తీవ్రమైన కదలిక తెచ్చింది. దీంతో రెండు రోజుల క్రితం ఈ ప్రైవేటు ఆసుపత్రులు- కరోనా చికిత్సలు అంశంపై తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అధికారలుతో్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్పొరేట్ ఆసుపత్రులపై వస్తున్న ఫిర్యాదులను పరిశీలించారు. ఇక తగిన చర్యలు చేపట్టక తప్పదనే నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగా ప్రైవేటు ఆసుపత్రులలో కరోనా చికిత్సకు అవలంభిస్తున్న పద్ధతులు, అందిస్తున్న వసతులతో పాటు చికిత్సకు వసూలు చేస్తున్న ఫీజులను పరిశీలించేందుకు ఒక విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విజిలెన్స్ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్న కార్పొరేట్ ఆసుపత్రులపై కొరడా ఝలిపించాలని, అవసరమైతే వాటి లైసెన్స్‌లు కూడా రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని ఆసుపత్రుల విషయంలో ఒక అంచనాకు వచ్చిన ప్రభుత్వం లైసెన్స్‌ల రద్దుకు అధికారిక నివేదికను ఆధారం చేసుకోనుంది. దీంతో కార్పొరేట్ ఆసుపత్రులు ఇకనైనా మారతాయా? లేక తమ దోపిడీని కొనసాగిస్తాయా అనేది చూడాల్సి ఉంది.













