ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ కు ఈటల రాజీనామా

మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి అధికారికంగా వెల్లడించారు. విషయమేందో తెలుసుకోకుండానే తనపై చర్యలు తీసుకున్నారని, రాత్రికి రాత్రే కేబినెట్ నుంచి తనను బర్తరఫ్ చేశారని మండిపడ్డారు. ఉరిశిక్ష పడ్డ ఖైదీని కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారని, కనీసం తన నుంచి సీఎం కేసీఆర్ వివరణ కూడా తీసుకోకుండా చర్యలు తీసుకున్నారని తీవ్రంగా ఫైర్ అయ్యారు. తనకు టీఆర్‌ఎస్‌తో 19 ఏళ్ల అనుబంధం ఉందని, ఆ అనుబంధానికి, పార్టీకి రాజీనామా ఇచ్చేస్తున్నానని ప్రకటించారు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం ఎన్నో సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. టీఆర్‌ఎస్ నుంచి ఎన్నిసార్లు తనకు బీఫాం ఇచ్చినా, అన్నిసార్లు పార్టీ పతాకాన్ని ఎగరేశానని గుర్తు చేసుకున్నారు. మరోవైపు ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, టీఆర్‌ఎస్ మహిళా విభాగం నేత తుల ఉమ కూడా రాజీనామా చేశారు.
ఇదంతా తాత్కాలిక విజయమే: ఈటల
కుట్రలు, కుతంత్రాలతో తాత్కాలికంగా విజయం సాధించొచ్చని, జీవితాంతం అది కొనసాగదని ఈటల స్పష్టం చేశారు. అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి తనను అవహేళన చేశారని, పట్టుమని పది సీట్లు గెలవలేదని ఆయన నిండు సభలో ఎద్దేవా చేసిన విషయాన్ని ఈల ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బకొడితే, రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లామని, ప్రలోభాలకు లొంగకుండా ఉద్యమకారులనే కరీంనగర్ ప్రజలు గెలిపించారని ప్రశంసించారు. ఆ కాలంలో కేసీఆర్ ధర్మాన్ని నమ్ముకున్నారని, ఇప్పుడు డబ్బు, అణచివేతలను నమ్ముకుంటున్నారని విమర్శించారు. ఆత్మగౌరవం, బాధ్యతలేని మంత్రి పదవి వద్దని గతంలోనే చెప్పానని, ప్రగతి భవన్ కాదు… బానిసల నిలయంగా పెట్టుకోవాలని కూడా ఆరోజే చెప్పానని తెలిపారు. సీఎంవోలో ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారి అయినా ఉన్నారా? అని ఈటల సూటిగా ప్రశ్నించారు.
నయీంకే బెదరలేదు.. అదరలేదు : ఈటల
చాలా విషయాలపై తాను మాట్లాడతున్నానన్న ఒక పాయింట్ మీదే తనపై కుట్రలు చేశారని ఈటల రాజేందర్ ఆరోపించారు. తానెప్పుడూ భయపడలేదని, నయీం రెక్కీ నిర్వహించి, బెదిరించినా, భయపడలేదని ప్రకటించారు. వందల మంది బలిదానాలు చేస్తే తెలంగాణ వచ్చిందని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కుట్రలతోనే ఎంతో మందిని పార్టీ నుంచి బయటకు పంపారని, తనపై తప్పుడు రాతలతో కుట్రలు, కుతంత్రాలు చేశారని ఆరోపించారు.