ప్రోటోకాల్ ప్రకారమే చికిత్స అందించాలి : ఈటల రాజేందర్
ప్రైవేట్ ఆస్పత్రులు ప్రోటోకాల్ ప్రకారమే కరోనా చికిత్స ఇవ్వాలని తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. అవసరం లేకపోయినా ఆక్సిజన్ పెట్టవద్దని సూచించారు. రెమిడెసివిర్ ఉత్పత్తి చేసే యాజమాన్యాలతో తాము మాట్లాడామని, సోమవారం నుంచి రెమిడెసివిర్ కొరత లేకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. రోజుకు లక్షన్నర మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. 25 ఏళ్లకు పైగా ఉన్నవారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం 2.70 లక్షల డోసుల వ్యాక్సిన్ తెలంగాణకు వచ్చే ఛాన్స్ ఉందని తెలిపారు. ఉత్పత్తి, ఆయా రాష్ట్రాల అవసరాలను బట్టే కేంద్రం వ్యాక్సిన్ను పంపిణీ చేస్తుందని, వ్యాక్సిన్ సమస్యను పరిష్కరించాలని తాము కేంద్రాన్ని ఇప్పటికే కోరామని అన్నారు. ప్రస్తుతం మాత్రం రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని తెలిపారు.
రాష్ట్రంలో 60 వేల పడకలున్నాయ్
రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో బెడ్స్కు ఏమాత్రం కొరత లేదని ఈటల స్పష్టం చేశారు. రాష్ట్రంలో 60 వేల పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి పీహెచ్సీలో వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా చూస్తామని, ప్రస్తుతం రోజుకు లక్షన్నర మందికి వ్యాక్సిన్ ఇస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి రోజుకు 10 లక్షల మందికి టీకా వేసే సామర్థ్యం ఉందని ప్రకటించారు. అలాగే నిత్యం 200 టన్నుల ఆక్సిజన్ కూడా అవసరం ఉంటుందని, అదే కేసులు పెరిగితే మాత్రం 350 టన్నులు అవసరం అవుతుందని ఆయన తెలిపారు.













