నాపై దాడి జరిగితే… అది యావత్ తెలంగాణపై
నాకు, నా కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్ వహించాల్సిందేనని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ను ఉద్దేశించి మరమనిషి అంటే సీఎం కేసీఆర్కు అంత కోపం ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్ అనేక మాటలు అన్నారని, వాటి సంగతేంటని నిలదీశారు. ఆయన తిట్లే తెలంగాణలో మాట్లాడే భాషనా? అని ప్రశ్నించారు. కేసీఆర్ చెప్పే ప్రతి మాట అబద్ధమేనని అన్నారు. బీఏసీ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలను పిలవలేదు. ఆ విషయంపై ఎమ్మెల్యే రఘునందన్ అడిగితే సభాపతి సమాధానం చెప్పలేదన్నారు. బీజేపీ సభ్యుల హక్కులను సభాపతి కాలరాశారు. ప్రజల సమస్యలపై సభలో ఎవరూ మాట్లాడకూడదా? బీఏసీలో సీఎం ఇచ్చిన అజెండానే సభలో అమలు చేశారు అని అన్నారు.
శాసనసభలో ప్రజాసమస్యలు ప్రస్తావించే అవకాశం ఇవ్వాలని కోరా. ఈ ప్రభుత్వం రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదు. రైతుల సమస్యలపై టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం సభలో చర్చించలేదు. నిరుద్యోగ సమస్యపై సభలో ఒక్కరూ మాట్లాడలేదు. గొల్లకురుమలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అన్ని పార్టీలు , సభ్యుల హక్కులను సభాపతి కాపాడాలి. సభలో తప్పు ఎవరిదో ప్రజలందరికి తెలుసు అని అన్నారు. గతంలో రెక్కీ నిర్వహించి నన్ను చంపుతామని బెదిరించినప్పుడే నేను భయపడలేదు. నాపై దాడి జరిగితే అది యావత్ తెలంగాణపై జరిగిన దాడిగా భావిస్తాం. 24 గంటలు స్వేచ్ఛగా, ఒంటరిగా తిరిగగలిగే శక్తి ఉన్నవాడిని నేను. చావుకు భయపడేది లేదు. ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎంత ఒత్తిడి చేసినా నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా సాగుతున్నాను అని అన్నారు.













