రాష్ట్రంలో ఇప్పుడు ..అలాంటి పరిస్థితి లేదు : ఈటల
తననై ఈగ వాలినా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఊరుకోదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హెచ్చరించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలోని పలివెలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారాన్ని కొందరు అడ్డుకుంటే రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోందని ప్రశ్నించారు. పథకం ప్రకారం తన కాన్వాయ్పైనా దాడి చేశారని ఆయన ఆరోపించారు. పలివెల గ్రామంలో తన సతీమణి ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తుంటే అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపించారు.
రాష్ట్ర మంత్రులు ప్రచారం చేస్తుంటే తాము అడ్డుకున్నామా? అని నిలదీశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక్కరే బయటకు వెళ్లినా సురక్షితంగా ఇంటికి చేరేవాళ్లమని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. టీఆర్ఎస్ మీటింగ్ వద్దకు వంద మంది బీజేపీ కార్యకర్తలు వెళితే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ దౌర్జన్యాలు ఆపకపోతే ప్రజలే బొందపెడతారన్నారు.













