తెలంగాణలో మరో రాజకీయ పోరాటం : ఈటల
తెలంగాణలో ఉద్యమాలు, ఉద్యమ కేంద్రాలు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. గన్‌పార్కు వద్ద తెలంగాణ అమరుడు పోలీసు కిష్టయ్య 12వ వర్థంతి సందర్భగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఈటల నివాళులు ర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ నియంత వైఖరికి తెలంగాణ ప్రజలు మరో రాజకీయ పోరాటానికి సిద్ధమవుతున్నారన్నారు. అమరవీరుల కోరుకున్న స్వేచ్ఛాయూత, ప్రజాస్వామ్య, తెలంగాణ రాలేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో నిర్బంధాలు, అణచివేతలు, అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని విమర్శించారు.
స్వేచ్ఛగా ఒక వ్యక్తి ఏ రాజకీయ పార్టీలో ఉండాలో నిర్దేశించుకొనే హక్కు స్వేచ్ఛగా లేదన్నారు. ఒక పౌరుడు నచ్చిన వ్యక్తికి ఓటు వేసే పరిస్థితి రాష్ట్రంలో లేకుండా పోయిందని ఆక్షేపించారు. ఆనాడు కేసీఆర్ ఏ ఉద్యమాన్ని నమ్ముకున్నారో, అదే కేసీఆర్ ఇవాళ ఉద్యమాలు, ఉద్యమ కేంద్రాలు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. జరుగుతున్న పరిణామాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఆత్మగౌరవం కోసం మరో రాజకీయ పోరాటానికి సిద్ధమవుతున్నారని తెలిపారు.













