రాష్ట్రంలో ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు : ఈటల
యుద్ధం కాదు కేసీఆర్ పతనం ఆరంభమైందని మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ రైతులు కన్నీళ్లు పెడుతుంటే నిమ్మకు నీరెత్తినట్టుగా కేసీఆర్ ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తోందని ఆరోపించారు. కేసీఆర్ అనాలోచిత విధానాల వల్లే రాష్ట్రం అస్తవ్యస్తమైందన్నారు. 40 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. రైతుల పరిస్థితికి పూర్తి బాధ్యత కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు.
కేసీఆర్ నిర్వాకం వల్ల తెలంగాణ రైతాంగమంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలన్నారు. గతంలో విపక్షాలతో చర్చించి సమస్యలు పరిష్కరించే ప్రభుత్వాలు ఉండేవి. రాష్ట్రంలో ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా కొనలేని వరి ధన్యాన్ని తెలంగాణ కొనుగోలు చేసిందని అసెంబ్లీలో సీఎం గొప్పలు చేస్తారు. కానీ అప్పుడు కేంద్రమే ధాన్యం కొనుగోలు చేస్తుందని, సహకరిస్తుందని అసెంబ్లీలో ఎక్కడా ప్రస్తావించలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాన్ని కేంద్రంపై రుద్దుతున్నారు. హుజూరాబాద్ ఎన్నిక కోసం రూ.వేల కోట్లు ఖర్చు పెట్టలేదా? రైతుల కోసం ఆ మాత్రం చేయలేరా? హుజూరాబాద్ ఫలితం నుంచి ప్రజల దృష్టి మరల్చాలని ప్రయత్నిస్తున్నారు అని ఆరోపించారు.













