సర్వే సంస్థలకు అందని రీతిలో .. తెలంగాణ ప్రజల తీర్పు
సర్వే సంస్థలకు అందని రీతిలో తెలంగాణ ప్రజల తీర్పు ఉండబోతోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. శామీర్‌పేటలోని తన నివాసంలో ఈటల మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతలతో ఫొటో దిగితే బీసీ బంధు, దళితబంధు, ప్రభుత్వ పథకాలు అందవని బీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారు. సంక్షేమ పథకాలు రావనే భయంతో బయటకు చెప్పకపోవచ్చు గానీ మరోసారి కేసీఆర్ గెలిస్తే మన బతుకులు ఆగమేనని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలన్నారు. స్వేచ్ఛ ఉంటే తన తప్పులు బయటపడతాయనే ఉద్దేశంతోనే సచివాలయంలోకి ప్రజా ప్రతినిధులు రాకుండా అడ్డుకుంటున్నారు. ఇంకా ఎన్నికలకు 6 నెలల సమయం ఉంది.
తెలంగాణలో ప్రత్యేక వ్యూహంతో బీజేపీ ముందుకెళ్తోంది. తప్పకుండా తెలంగాణలో బీజేపీ విజయం సాధిస్తుందన్నారు. జాగ్రత్తగా ఉండాలని కొన్ని నెలలుగా నన్ను బెదిరిస్తున్నారు. నయామ్కే భయపడలేదు, ఈ బెదిరింపులకు భయపడతానా? పార్టీలు మారడం దుస్తులు మార్చుకున్నంత సులువు కాదు. బీఆర్ఎస్ నుంచి నేను బయటకు రాలేదు, గెంటేస్తే వచ్చాను. నాకు నేనుగా పార్టీ మారలేదు. నన్ను బయటకు పంపించినప్పుడు కేసీఆర్ కుటుంబీకులు బాధపడి ఉంటారు. జాతీయ రాజకీయాలు నాకు కొత్త. నాకు నేనుగా ఢిల్లీకి వెళ్లలేదు. అపాయింట్మెంట్ కోరలేదు. బీజేపీ అధిష్ఠానం పిలిస్తేనే ఢిల్లీకి వెళ్లాను. బీఆర్ఎస్ను కొట్టేది బీజేపీనే అని అన్నారు.













