ఆ వ్యాఖ్యలతో అంబేద్కర్ను కేసీఆర్ అవమానించారు
రాజ్యాంగాన్ని మార్చాలనటం అంబేద్కర్ను అవమానించటమేనని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈటల మీడియాతో మాట్లాడారు. దోపిడీ, పక్షపాతానికి వ్యతిరేకంగా రాజ్యాంగం సమానతను పంచిందని తెలిపారు. రాజ్యాంగంలో అంబేద్కర్ పేర్కొన్న ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ ఏర్పడిరదని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. దళితబిడ్డ రాష్ట్రపతిగా, చాయ్ వాలా ప్రధానిగా ఉన్నారంటే అంబేద్కర్ పుణ్యమేనన్నారు. కేసీఆర్ సంస్కార హీనమైన మాటలు వినలేక ప్రజలు టీవీలు బంద్ పెట్టారన్నారు. కేసీఆర్ బూతు పురాణంపై తెలంగాణ పట్టణాలు, పలెల్లో చర్చ జరుగుతోందని అన్నారు. కేసీఆర్ పాలనను భరించలేక రాష్ట్రంలో ఎంతో మంది ఐఏఎస్ అధికారులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారన్నారు. కల్వకుంట్ల రాజ్యాంగం, రాచరిక పాలన కావాలని కేసీఆర్ కోరుకుంటున్నారని ఆరోపించారు.













