ఎలాగైనా ప్రజలను కాపాడుకుంటాం : ఈటల
కోవిడ్ బారి నుంచి తెలంగాణ ప్రజానీకాన్ని ఎలాగైనా కాపాడుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. ఎన్నిక వందల కోట్లైనా ఖర్చు పెడతామని, తెలంగాణ ప్రజలను కాపాడుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. హుజురాబాద్ మండలంలో జరిగిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి వైద్య ఆరోగ్య శాఖ వందకు వంద శాతం పనిచేస్తోందని పేర్కొన్నారు. కోవిడ్ పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఓ ఐఏఎస్ అధికారిని నియమించామని పేర్కొన్నారు. తెలంగాణకు దగ్గరగా ఉన్న ప్రాంతాల నుంచి ఆక్సిజన్‌ను సరఫరా చేయాలని తాము కేంద్రాన్ని కోరామని, ఆక్సిజన్ కొరత లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తునే ఉన్నామని ప్రకటించారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఎక్కడా రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరతే లేదన్నారు. కరోనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి కూడా సీతారాముల కల్యాణోత్సవాలు నిరాడంబరంగానే జరిగాయని పేర్కొన్నారు. వచ్చేసారి రామ నవరాత్రులు ప్రజల సమక్షంలో జరగాలని ఆకాంక్షించారు. కరోనా సమయంలో ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలని, పాజిటివ్ కేసులు పెరగకుండా చూడాలని ఈటల పిలుపునిచ్చారు.













