ఇకపై రోజుకు 10వేల టెస్టులు: తెలంగాణ మంత్రి ఈటెల
తెలంగాణలో కరోనా టెస్టుల సంఖ్య బాగా పెంచనున్నట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. ఈ నెల 7వ తేదీ నుంచి రోజుకు సగటున 10 వేల ఆర్టీపీసిఆర్ టెస్టులు చేయనున్నామన్నారు. ఎన్నో భయంకరమైన వైరస్లను ఎదుర్కున్న అనుభవం మన వైద్యులకు ఉందన్నారు. అయితే ఎన్ని వైరస్లు వచ్చినా కరోనా స్థాయిలో నష్టం కలగలేదన్నారు. కరోనా గురించి ప్రజలు భయపడాల్సిన పని లేదని చెప్పారు. కరోనా వ్యాధి లక్షణాలు కనపడగానే ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి వెళితే సులభంగా నయమైపోతుందన్నారు.
తీరుమారకపోతే ప్రై “వేటే”…
ప్రైవేటు ఆసుపత్రులు సంపాదించుకోవడానికి ఇది సరైన సమయం కాదని ఈటెల ఈ సందర్భంగా హితవు చెప్పారు. తాజాగా హైదరాబాద్లోని డెక్కన్ ఆసుపత్రిపై చర్యలు తీసుకున్న నేపధ్యంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రలు వ్యాపారంగా భావించవద్దు. ప్రజలను భయపెట్టి రూ.లక్షలు దండుకోవడం సరైంది కాదన్నారు. అలాంటి ఆసుపత్రులపై చర్యలు తప్పవన్నారు. ఇప్పటికే ఒక ఆసుపత్రిపై చర్యలు తీసుకున్నామన్నారు.. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు రావాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్ల, ఆక్సిజన్ కొరత లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరమైనన్ని బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కరోనా విషయంలో గ్రామీణ వైద్యులకూ అవగాహన కల్పిస్తామన్నారు.













