ఈసారి గజ్వేల్ లో కూడా అదే జరుగుతుంది
గజ్వేల్లో ఎన్నికలు కురుక్షేత్ర యుద్దం లాంటివని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. వర్గల్ సరస్వతీ దేవి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం పార్టీ కార్యకర్తలతో ఈటల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు బుద్ధి చెబుతారన్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా గజ్వేల్లో గెలిచేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్లో ఏ పార్టీ అయిన సరే మీటింగ్ పెట్టుకోవచ్చు. బీజేపీ నిర్వహించే సమావేశాలకు రాకుండా ప్రజలను అడ్డుకుంటున్నారు. దావతులు ఇచ్చి, పైసలు పంచి రాకుండా ఆపేస్తున్నారు. హుజరాబాద్ ఉప ఎన్నిక సమయంలోనూ ఇదే తరహాలో చేశారు. కానీ అక్కడ ఈ ప్రలోభాలు, డబ్బు పంపకాలకు హుజూరాబాద్ ప్రజలు పాతరేసి ధర్మాన్ని, న్యాయాన్ని, ఉద్యమ బిడ్డను గెలిపించుకున్నారు. ఈసారి గజ్వేల్లో కూడా అదే జరుగుతుంది. ప్రజాస్వామ్యాన్ని ధర్మాన్ని కాపాడాలని గజ్వేల్ ప్రజలను కోరుతున్నా అని అన్నారు.













