అధికారాన్ని అడ్డుపెట్టుకుని కావాలనే నాపై కేసులు… ఈటల సంచలన ఆరోపణలు
పదో తరగతి హిందీ పేపర్ లీక్ మాట పచ్చి అబద్దమని, అది మాల్ ప్రాక్టీస్ అవుతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. పేపర్ బయటకు వచ్చిన ఘటనపై వరంగల్ డీసీసీ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతూ నా సెల్‌ఫోన్ తీసుకుని డీసీపీ వద్ద ఈ రోజు విచారణకు హాజరయ్యాను. నా సమక్షంలోనే అధికారులు సెల్‌ఫోన్ పరిశీలించారు. ప్రశాంత్ నుంచి ఎలాంటి ఫోన్ రాలేదని నిర్దరించుకున్నారు. నా మొబైల్‌కు మహేశ్ వాట్సప్ మెసేజ్ పంపాడు. ఆ మెసేజ్‌ను ఇతరులకు పంపలేదని పోలీసులు తెలుసుకున్నారు. ఉదయం 9:30 గంటలకు పరీక్ష మొదలైతే 11 గంటల తర్వాత పేపర్ బయటికి వస్తే దాన్ని పేపర్ లీక్ అని ఎలా అంటారు? కేసీఆర్ ప్రగతిభవన్‌లో కూర్చొని మమ్మల్ని ఎలా అయినా ఇరికించాలని చూస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకని కావాలనే నాపై కేసులు పెట్టాలని కుట్ర పన్నారు అని ఆరోపించారు.
దేశంలోనే ధనిక సీఎం, ధనిక పార్టీగా బీఆర్ఎస్ నిలిచిందన్నారు. ఎనిమిదేళ్లలో రూ.వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంట్రాక్టులు, ఇసుక, మద్యం, దందాలతో దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. అసైన్డ్ భూములు దోచుకుని స్థిరాస్తి దందా చేస్తున్నారన్నారు. వీటన్నింటిపైనా చర్చ జరగకుండా ఉండాలనే తమపై అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని కేసులు పెట్టినా వెనకడుగు వేసేది లేదని, పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.













