ప్రజలతో ఛీకొట్టించుకున్న ఏకైక సీఎం రేవంత్: ఈటల రాజేందర్

ప్రజలతో ఛీకొట్టించుకున్న ఏకైక సీఎం రేవంత్ రెడ్డేనంటూ బీజేపీ నేత ఈటల రాజేందర్ ఘాటు విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు కూడా గడవక ముందే కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధికంగా అక్రమ వసూళ్లకు పాల్పడిందని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాలే స్వయంగా ఆర్‌ఆర్ ట్యాక్స్ గురించి మాట్లాడారంటే.. తెలంగాణలో ఏ స్థాయిలో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయో అర్థం చేసుకోవాలని ప్రజలను హెచ్చరించారు. వరంగల్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఈటల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘హైదరాబాద్‌లో బిల్డింగ్ పర్మిషన్ కావాలంటే కాంగ్రెస్ వాళ్లకు సపరేట్ ఫీజు కట్టాల్సిందే. ఎవరైనా ఫీజు చెల్లించకపోతే పర్మిషన్ రాదు. అంత దారుణంగా ఉంది రాష్ట్రంలో పరిస్థితి. కాంగ్రెస్ వాళ్లు ఆవురావురుమంటున్నారు. ఎప్పటివరకు అధికారంలో ఉంటారో తెలీదు. అందుకే వీలైనంత తొందరగా అంతా సర్దుకుంటున్నారు’’ అంటూ ఈటల షాకింగ్ ఆరోపణలు చేశారు. అనంతరం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన ఈటల.. ప్రజలు భిక్ష పెడితే రేవంత్‌కి సీఎం పీఠం దక్కిందని, ఇప్పుడు వాళ్లనే ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. అదే ప్రజలు ఒక్కసారి దెబ్బకొడితే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని హెచ్చరించారు.