ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ మంత్రులు బెదిరిస్తున్నారు: ఈటల రాజేందర్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారంటూ బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులకే ఓట్లు వేయించాలంటూ స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలకు ఆల్టిమేటంలు జారీ చేస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా సోమవారం ఖమ్మం జిల్లాలోని ఇల్లెందులో ఈటల రాజేందర్ ప్రచారం నిర్వహించారు. ఈ సంద్భంగా ఆయన కాంగ్రెస్ మంత్రులపై ఫైర్ అయ్యారు.
విద్యావంతులు, పట్టభద్రుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించిన ఈటల.. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నిరుద్యోగులను కాంగ్రెస్ నిలువునా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పట్టభద్రుల ఓట్లు అడిగే ముందు యూనివర్శిటీల్లో రెగ్యులర్ నియామకాలు ఎందుకు చేయడం లేదో చెప్పండి. ప్రభుత్వోద్యోగులకు కొత్త పీఎర్సీ ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి కేంద్రంలోని బీజేపీ సర్కార్ 4 డీఏలు ఇచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఒక్క డీఏ కూడా ఎందుకు ఇవ్వలేదో చెప్పండి. 317 జీవోలో ఉన్న తప్పులను సరిదిద్ది ఉపాధ్యాయులకు వెంటనే న్యాయం చేయండి. ఇవేమీ చేయకపోగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు వేయించాలంటూ స్కూళ్లు, కాలేజీ యాజమాన్యాలపై కాంగ్రెస్ మంత్రులు బెదిరింపులకు దిగుతారా..?’’ అంటూ టీ సర్కార్‌పై ఈటల నిప్పులు చెరిగారు.