కేసీఆర్ అహంకారానికి ఇది నిదర్శనం : ఈటల
అసెంబ్లీలో తప్పించుకోవచ్చు కానీ, ప్రజల చేతిలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి శిక్ష తప్పదని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై చర్చించాల్సిన శాసనసభ తొలిరోజు కేవలం 5 నిమిషాలే సాగిందన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ ప్రభుత్వం మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తోందని విమర్శించారు. శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్నాయంటే తమ సమస్యలు ప్రస్తావించాలని పలు రంగాల వారు విన్నవించుకునే పరిస్థితి ఉండేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 80 నుంచి 90 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగేవి. బడ్జెట్ సమావేశాలు 40`50 రోజులు జరిగేవి. గత సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలను ఆకారణంగా, అన్యాయంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. తమ సమస్యలను సభలో ప్రస్తావించాలని వీఆర్ఏలు, వీఆర్వోలు, గిరిజనులు కోరుతున్నారు. జీతాలు సమయానికి రాకపోవడంతో ఉద్యోగులు ఇబ్బదులు పడుతున్నారు.
అవకాశం వస్తే ప్రజా సమస్యలపై మాట్లాడతాం. లేదంటే ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తాం. స్పీకర్ మరమనిషిలా వ్యవహరిస్తున్నారు. సీఎం చెప్పింది తప్ప స్పీకర్ వేరే పనిచేయడం లేదు. ఉమ్మడి ఏపీలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నా బీఏసీ సమావేశానికి పిలిచేవారు. ఇప్పుడు సభా సంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నారు. చరిత్రలో ఎప్పడూ ఇంత తక్కువ రోజులు సమావేశాలు జరగలేదు. బీఏసీని సంప్రదించకుండా 3 రోజులకే పరిమితం చేశారు. కేసీఆర్ అహంకారానికి ఇది నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.













