కేసీఆర్‌కు ఆరేళ్లు పడితే.. రేవంత్ ఆరు నెలల్లోనే : ఎంపీ ఈటల

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ బ్యూటిఫికేషన్ చేస్తాననేది కేవలం డబ్బు సంచులు నింపుకోవడానికేనని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని టీకేఆర్ కాలనీలో మూసీ పరివాహక ప్రాంతాన్ని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి పరిశీలించారు. ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ ఇప్పటివరకు నిర్మించిన మురుగు శుద్ధి కేంద్రాలు( ఎస్టీపీ)లను ప్రారంభించే తెలివి సీఎంకు లేదని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు.
ప్రజల దృష్టి మళ్లించేందుకే హైడ్రా, మూసీ పేరుతో కొత్త నాటకాలను తెర లేపారన్నారు. పేదలకు అన్యాయం చేసి పెట్టుబడిదారులకు వత్తాసు పలకడం సీఎం రేవంత్ రెడ్డికే చెల్లిందని ఎద్దేవా చేశారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ నిజస్వరూపం తెలిసేందుకు ఆరేళ్లు పడితే, రేవంత్ దుర్బుద్ధి ఆరు నెలల్లోనే బయటపడిరదన్నారు. ఇష్టారీతిన వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పాలనకు మంచి రోజులు ముగిశాయన్నారు. మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదన్నారు. మూసీలో విషపదార్థాలు, రసాయనాలు చేరకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.