జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్.. ఎటూగాని పరిస్థితిని
తీవ్ర అసహనంతో ఉన్న అధికార పార్టీ బీజేపీ కార్యకర్తలపై దాడులు చేయిస్తోందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌తో భేటీ అయిన ఈటల గోషామహల్ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. భేటీ అనంతరం ఈటల మాట్లాడుతూ జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారిందన్నారు. ఎటూగాని పరిస్థితిని కేసీఆర్ ఎదుర్కొంటున్నారని తెలిపారు. బీజేపీ కార్యకర్తలపై బీఆర్ఎస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. గోషామహల్లో బీజేపీ కార్పొరేటర్లను బీఆర్ఎస్ నేతలు వేధిస్తున్నారు. బీజేపీ కార్యకర్తలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కార్పొరేటర్ శశికళపై అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గజ్వేల్‌లో అకారణంగా దాడి చేసి కొట్టారు. కేసులు పెట్టారు. 14 రోజులు జైల్లో పెట్టారు. ఈ రోజు బెయిల్‌పై బయటకు వచ్చారు. మీర్‌పేటలో ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపారు. బీజేపీ కార్యకర్తలతో గిల్లికజ్జాలు పెట్టుకొని బీఆర్ఎస్ నేతలు దాడులు చేస్తున్నారు. హుజూరాబాద్‌లో ఓ సర్పంచ్‌ను కొట్టి అకారణంగా జైల్లో పెట్టి వేధించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ వ్యవహారం పార్టీ అధిష్ఠానం పరిధిలో ఉందని తెలిపారు. రాజాసింగ్ పై వేసిన సస్పెన్షన్‌ను ఎత్తివేసేలా పార్టీ పెద్దలతో మాట్లాడతా అని అన్నారు.













