ఆ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి విఫలం
ధాన్యం కొనుగోళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. హుజూరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీలు, రైతు సంఘాలంటే చిన్నచూపని విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేయలేదని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. వరి మద్దతు ధర రూ.2,020 ఉండగా, కొనుగోలు కేంద్రాలు సక్రమంగా లేకపోవటంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. రూ.1300 నుంచి రూ.1600లకే ధాన్యం విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఏదైనా మాట్లాడితే వారిపై దాడి చేస్తున్నారని అన్నారు. ఆకాల వర్షాలతో చేతికందిన ధాన్యం నీటిలో కొట్టుకుపోతుంటే రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఈ సమయంలో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు విందులు చేసుకుంటున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ముమ్మరం చేయాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.













