పద్మశ్రీ విజయ సారధి ఇక లేరు
తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రఖ్యాత కవి పద్మశ్రీ అవార్డు గ్రహీత భాష్యం విజయసారధి బుధవారం తెల్లవారు జామున మృతి చెందారు. శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నెల రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురై స్వగృహంలో మృతి చెందారు. 1936 మార్చి 10న కరీంనగర్ మండలం చేగుర్తి గ్రామంలో గోపమాంబ, నరసింహాచార్య దంపతులకు జన్మించారు. సంస్కృతంలో అనేక కావ్యాలు రచించిన విజయసారథి అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు. 2021లో అప్పటి రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. సంస్కృతంలో దక్షిణ భారత దేశం నుంచి ఈ అత్యున్నత అవార్డును అందుకున్న ఏకైక కవి విజయసారథి. ముఖ్యమంత్రి కేసీఆర్ పై రచించిన చంద్రశేఖర ప్రశస్తి ఎంతో ప్రాచూర్యాన్ని పొందింది. విజయసారథి సంస్కృత భాషలో కూలంకషమైన పాండిత్యంతో పాటు కవిత్వంలోనూ తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. ఇరుకుల్ల సమీపంలోని పద్మనాయక శ్మశాన వాటికలో విజయసారథి అంతిమ సంస్కారాలు జరిగాయి.













