మళ్లీ ఆ గుర్తులు ప్రత్యక్షం.. అభ్యర్థుల్లో ఆందోళన!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో పాటు అభ్యర్థులకు ఎన్నికల సంఘం గుర్తులు కేటాయించింది. ఈ ఎన్నికల్లో 193 గుర్తుల జాబితా సిద్ధం చేసి బరిలో నిలిచిన అభ్యర్థులకు ప్రాధాన్యత ప్రకారం కేటాయించింది. గత ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఓట్లకు గండికొట్టిన రోడ్డు రోలర్, ఆటో, ట్రక్కు గుర్తులు మళ్లీ జాబితాలో ప్రత్యక్షమయ్యాయి. వీటికోసం పలు నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడ్డారు. వారు రిటర్నింగ్ అధికారికి సూచించిన గుర్తులలో ముందుగా రోడ్డు రోలర్, ఆటో, ట్రక్కు గుర్తులకే ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆర్వోలు చెబుతున్నారు.
ఈ గుర్తులపై కేంద్ర ఎన్నికల కమిషన్కు అధికార పార్టీ పెద్దలు హస్తినకు వెళ్లి ఈ మూడు గుర్తులు ఎవరికీ కేటాయించవద్దని, వాటిని జాబితా నుంచి తొలగించాలని కోరారు. అయినప్పటికీ ఎన్నికల అధికారులు మాత్రం పాత విధానంలోనే అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. దీంతో ప్రధాన పార్టీకి చెందిన నాయకులు ఈ మూడు గుర్తులు స్వతంత్రులకు ఇవ్వడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి ద్వారా తమకు వచ్చే ఓట్లు ఇతరులకు పడుతున్నాయని, ఎన్నికల్లో విజయావకాశాలు దెబ్బతీస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.













