టీఆర్ఎస్ కు ఊరట
అధికార టీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఊరట లభించింది. కారును పోలిన ట్రక్కు గుర్తు, ఇస్త్రీ పెట్టె గుర్తులను ప్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఎంపీ వినోద్‌కుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కారు గుర్తు పలుచగా ఉండటంతో చాలా మంది ఓటర్లు గందరగోళానికి గురయ్యారని వెల్లడించారు. కారు గుర్తును అందరికీ కనిపించేలా థిక్ (ఒత్తుగా) పేపర్లో ప్రచురిస్తామని ఎన్నికల సంఘం తమకు హామీ ఇచ్చిందన్నారు. గత ఎన్నికల్లో కారు గుర్తును పోలీ ఉన్న గుర్తులతో టీఆర్ఎస్కు నష్టం జరిగిందని ఆయన పేర్కొన్నారు. కొన్ని చోట్ల తమ అభ్యర్థులు ఆ గుర్తుల వల్ల ఓడిపోయారని కూడా వినోద్ గుర్తు చేశారు. ట్రక్కుతో పాటు మరో నాలుగు గుర్తులను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించామన్నారు. తమ పోరాటానికి ఎన్నికల సంఘం దిగి వచ్చిందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులును స్వాగతిస్తున్నామని ఎంపీ వినోద్‌కుమార్ పేర్కొన్నారు.













