అమెరికాలో ఉన్నత విద్యపై హెచ్ఐసీసీలో ఫెయిర్
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించేందుకు యునైటెడ్ స్టేట్స్-ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ (యూఎస్ఐఈఎఫ్) యూనివర్సిటీ ఫెయిర్‌ను నిర్వహిస్తోంది. ఈ నెల 26న హెచ్ఐసీసీలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ ఫెయిర్ కొనసాగుతుందని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఇందులో పాల్గొనవచ్చని, ఎలాంటి ప్రవేశ రుసుము ఉండదని, కేవలం రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుందన్నారు.
అమెరికాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 40 గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు, కళాశాలల ప్రతినిధులు దీనికి హాజరవుతున్నారని, ప్రత్యక్షంగా హాజరై వారితో సంప్రదించి అవగాహన పొందే అవకాశం ఉంటుందని వెల్లడించారు. అమెరికాలో ఉన్నత విద్యాధ్యయనం, అందులో ఉండే అవకాశాలు, యూఎస్ స్టూడెంట్ వీసా పొందే పద్ధతి, అమెరికాలో బస తదితర సమగ్ర వివరాలు తెలుసుకునేందుకు అమెరికా యూనివర్సిటీల ప్రతినిధులు, సలహాదారులు, యూఎస్ ఎంబసీ ప్రతినిధులు ఈ ఫెయిర్‌లో అందుబాటులో ఉంటారని తెలిపారు. ఇతర వివరల కోసం https://www.usief.org.in/Hyderabad.aspx వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.













