ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాలు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు చేపట్టింది. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసానికి చేరుకున్న అధికారులు, ఇంట్లోకి ఎవరినీ అనుమతించకుండా తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించిన ఈడీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఇద్దరు మహిళా అధికారులు సహా 8 మంది బృందం సోదాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. కవిత నివాసంలో ఉన్న అందరి వద్ద సెల్‌ఫోన్లును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈడీ అధికారులు వచ్చిన సమయంలో కవిత, ఆమె భర్త అనిల్ ఇంట్లోనే ఉన్నారు. సోదాల విషయం తెలుసుకొని కవిత నివాసానికి చేరుకొన్న బీఆర్‌ఎస్ లీగల్‌సెల్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌ను అధికారులు అనుమతించలేదు. తనిఖీలు ముగిసిన తర్వాత ఆమెను కలవాలని ఈడీ అధికారులు సూచించారు.