కవితకు షాక్..! లిక్కర్ స్కాం కేసులో ఈడీ మరో చార్జ్‌షీట్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కే కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో షాకిచ్చింది. ఈ కేసులో భాగంగా ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితపై శుక్రవారం మరో ఛార్జిషీట్ దాఖలు చేసింది. అంతేకాకుండా తాజా చార్జ్‌షీట్‌లో కవితను ప్రధాన నిందితురాలిగా పేర్కొంది. ‘‘లిక్కర్ కేసులో కవిత కీలక సూత్రధారి, పాత్రధారి. కవితతో పాటు మిగిలిన నలుగురు నిందితులు ఛన్‌ప్రీత్ సింగ్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అర్వింద్ సింగ్ పాత్ర కూడా ఈ స్కాంలో ఉంది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. అందుకే విచారణలో భాగంగా సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేస్తున్నాం’’ అంటూ ఈడీ కోర్టుకు వెల్లడించింది.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ, ఈడీ తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్లను స్పెషల్ కోర్టు గత సోమవారం కొట్టివేసింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లలో కవిత ఒకరని, అందువల్ల ఆమెకు ఎన్నికల ప్రచారం కోసమైనా బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరపు లాయర్లు కోర్టును కోరారు. అలాగే, మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్-45 ప్రకారం బెయిల్ పొందే అర్హత ఆమెకు ఉందంటూ విజ్ఞప్తి చేశారు. కానీ దర్యాప్తు సంస్థ అధికారులు మాత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత కీలక పాత్రధారని, ఆమెకు బెయిల్ ఇస్తే ఆమె సాక్ష్యులను ప్రభావితం చేస్తారంటూ కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు.. కవిత పిటిషన్‌ను కొట్టేయడమే కాకుండా ఆమెకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.