ఓటుకు నోటు : రేవంత్ పై ఛార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ

సుదీర్ఘ కాలం తర్వాత ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఎంపీ రేవంత్ రెడ్డి పేరును ప్రధాన నిందితుడిగా చేరుస్తూ ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. రేవంత్‌తో పాటు ఈ ఛార్జ్‌షీట్‌లో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్, ఉదయసింహ, మత్తయ్యతో పాటు వేం కృష్ణకీర్తన్ పేర్లను ఈడీ నమోదు చేసింది. ఎమ్మెల్యే స్టీఫెన్‌ను రేవంత్ 50 లక్షలు ఇచ్చినట్లు ఈడీ తన ఛార్జ్‌షీట్‌లో తెలిపింది. మండలి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసే విధంగా, స్టీఫెన్‌సన్‌తో రాయబారం నడిపినట్లుగా రేవంత్ పై ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. వేం నరేందర్ రెడ్డికి ఓటు వేయాల్సిందిగా స్టీఫెన్‌సన్‌ను ప్రలోభాలకు గురిచేశారని ఏసీబీ అభియోగం మోపగా… ఆ తర్వాత ఈ కేసుపై ఈడీ పూర్తి ఆధారాలు సేకరించింది. దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఈడీ రేవంత్ పై ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.
ఏం జరిగిందంటే…
తెలంగాణలో 2015 లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగానే ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో టీడీపీ నేతలు బేరసారాలు జరిపారన్నది ప్రధాన ఆరోపణలు. ఈ సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్టీఫెన్‌సన్‌తో ఫోన్లో మాట్లాడారన్నది ఆరోపణ.
చంద్రబాబుకు రిలీఫేనా?
దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఈడీ ఓటుకు నోటు కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఎంపీ రేవంత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా ఇందులో పేర్కొంది. అయితే అధికారికంగా ఇప్పటి వరకూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరును మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. ఈడీ ట్విట్టర్‌లో మాత్రం చంద్రబాబు పేరు లేదు. అయితే చంద్రబాబు పాత్రను ఈడీ ప్రస్తావించినట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతానికైతే చంద్రబాబుకు ఓటు నోటు వ్యవహారంలో రిలీఫ్ దొరికినట్లేనని ఆయన వర్గీయులు అంటున్నారు.