సంక్రాంతి తర్వాతే పంచాయతీ!
సంక్రాంతి తర్వాతే పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయా? రిజర్వేషన్ల ఖరారులో జాప్యమే ఇందుకు కారణమా? హైకోర్టు ఆదేశాల ప్రకారం జనవరి పదో తేదీలోపు నోటిఫికేషన్ జారీ చేసి, సంక్రాంతి తర్వాత ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోందా? ఈ ప్రశ్నలకు ఔను అనే అంటూన్నాయి అధికార వర్గాలు. రిజర్వేషన్ల ప్రక్రియను ఈ నెల 29 నాటికి పూర్తి చేయాలని జిల్లాల కలెక్టర్లను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నీతూప్రసాద్ ఆదేశించిన విషయం తెలిసిందే. దాంతో ఆ ప్రక్రియ సకాలంలో పూర్తయిపోతే, జనవరి 3న నోటిఫికేషన్ జారీ చేయాలని ఎన్నికల సంఘం భావించింది.
రిజర్వేషన్ల ఖారారులో జాప్యం ప్రభావం నోటిఫికేషన్‌పై జారీపై చూపుతోంది. గత ఎన్నికల మాదిరిగానే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కానీ, మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించరాదని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఇటీవల ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో, రిజర్వేషన్ల ప్రక్రియను మళ్లీ మొదటికి తేవాల్సి వచ్చింది. రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తే, ఎస్సీ, ఎస్టీలకు ఎంత? బీసీలకు ఎంత? అనే లెక్కలు తెలుస్తున్నారు. ఈ వివరాలు అందితే తప్ప ఆయా కేటగిరీలకు వార్డు, గ్రామ, మండల స్థాయిలో కోటాలను ఖారరు చేయడం సాధ్యం కాదు.













