డ్రైవర్లకు, కండక్టర్లకు తలనొప్పిగా మారిన ఉచిత బస్సు ప్రయాణం..

తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పథకం ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ.. రోజుకొక కొత్త సమస్య కలిగిస్తోంది. మన పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా ఇదే రకమైన పథకం అమలులో ఉన్నప్పటికీ అక్కడ ఇటువంటి ఇబ్బందులు మాత్రం లేవు. తెలంగాణలో మాత్రం సీటు దగ్గర నుంచి టికెట్ వరకు.. బస్సు ఎక్కే దగ్గర నుంచి దిగే వరకు.. ప్రతి విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి.
తాజాగా ఈ గొడవలు భరించలేక ఓ బస్సు డ్రైవర్ అలిగి బస్సును వదిలేసి రోడ్డుపైకి వచ్చి నిలబడ్డాడు. ఇక చేసేది లేక కొంతమంది మహిళలు బస్సు దిగడంతో ఆయన వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఈ విచిత్ర సంఘటన నల్గొండ జిల్లాలోని పెద్ద అడిశర్లపల్లిలో ఉదయం 10 గంటలకు పెద్దగట్టు నుంచి హైదరాబాదుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో చోటుచేసుకుంది. అప్పటికే కిక్కిరిసిపోయి ఉన్న బస్సులో మరికొందరు మహిళలు ఎక్కడానికి ప్రయత్నించారు. ఎంత వారించినా వినకుండా డ్రైవర్ తో గొడవ పడి మరీ వాళ్ళు బస్సు ఎక్కారు. దీంతో సహనం కోల్పోయిన డ్రైవర్ ఇంత మందితో నేను బస్ నడపలేనని.. అలా చేయడం చాలా ప్రమాదకరమని భావించి బస్సు దిగేసాడు. దీంతో కొందరు మహిళలు బస్సు దిగి ఆటోలో వెళ్లిపోయారు.
ఇలా కిక్కిరిసిన ప్రయాణికులతో బస్సులు నడపడం డ్రైవర్లకు చాలా ఇబ్బందిగా ఉంది. ఏ మాత్రం తేడా జరిగిన వందల సంఖ్యలో ప్రాణాలకు నష్టం కలుగుతుంది. ఇటువంటి ఉచితాల కారణంగా ఇబ్బందులు తలెత్తడంతో పాటు రాష్ట్రానికి ఆర్థికపరమైన నష్టం కూడా కనిపిస్తోంది. మెట్రో రాబడి తగ్గడంతో పాటు.. ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారు. తెలంగాణలో ఈ సమస్యలకు ప్రత్యామ్నాయం చూపించలేక రేవంత్ సర్కార్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది.