హైదరాబాద్ లో 23న డా. రామినేని ఫౌండేషన్ అవార్డుల ప్రదానం
భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లకు రామినేని ఫౌండేషన్ విశిష్ట పురస్కారం
2021 ఏడాది పురస్కారాలను హైదరాబాద్‌లో డిసెంబర్ 23న జరిగే వేడుకల్లో బహుకరించనున్నట్లు డా. రామినేని ఫౌండేషన్ ప్రకటించింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న అన్వయ కన్వెన్షన్స్‌లో ఈ వేడుకల కార్యక్రమం జరగనున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ హాజరవుతున్నారు. డా. రామినేని ఫౌండేషన్ యుఎస్ఎ కన్వీనర్ పాతూరి నాగభూషణం, డా. రామినేని ఫౌండేషన్ యుఎస్ఎ చైర్మన్ ధర్మప్రచారక్ రామినేని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నారు.
గతేడాది అవార్డులు ప్రకటించినా అవార్డుల ప్రదానోత్సవ సభ నిర్వహించలేకపోయామని. ఈ ఏడాది అవార్డులతో పాటు.. గతేడాది అవార్డులను కూడా ఒకే వేదికపై ప్రదానం చేయనున్నట్లు రామినేని ఫౌండేషన్ కన్వీనర్ పాతూరి నాగభూషణం తెలిపారు. 32 రంగాలకు చెందినవారిని.. న్యాయ నిర్ణేతలు అవార్డులకు ఎంపిక చేశారన్నారు.
2020 సంవత్సరానికి సంబంధించి విశిష్ట పురస్కారాన్ని నాబార్డ్ చైర్మన్ డా. జి.ఆర్. చింతలకు, ప్రత్యేక పురస్కారాన్ని నటుడు, నిర్మాత, మానవతావాది, సోనూసూద్‌కు, విశేష పురస్కారాన్ని యాంకర్ శ్రీమతి సుమ కనకాలకు, హీలింగ్ హస్త హెర్బల్స్ ప్రై. లిమిటెడ్ ఎండి డా. బి. మస్తాన్ యాదవ్‌కు, షిర్డిలోని ద్వారకామాయి సేవా ట్రస్ట్ ఫౌండర్, ఎండి బండ్లమూడి శ్రీనివాస్‌కు ప్రకటించారు.
2021 రామినేని ఫౌండేషన్ అవార్డులు..
విశిష్ట పురస్కారం: భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణా ఎల్ల, భారత్ బయోటెక్ జాయింట్ ఎండీ సుచిత్రా ఎల్ల, విశేష పురస్కారం: సినీ నటులు కె. బ్రహ్మానందం, నిమ్స్ ప్రొఫెసర్, అనస్థీషియా విభాగ అధిపతి డాక్టర్ దుర్గా పద్మజా, తెలుగు సినిమా పాత్రికేయులు యస్.వి. రామారావుకు ఇస్తున్నారు.
ఈ వేడుకల్లో సంగీత కచేరి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. శ్రేష్ట భారత్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ సంగీత కచేరీని పద్మశ్రీ అవార్డు గ్రహీత, సంగీత కళానిధి శ్రీమతి అరుణ సాయిరాం చేస్తున్నారు. శ్రీమతి పద్మ శంకర్ వయోలిన్, ఎస్ ఆకాశ్ – ఫ్లూట్, సాయిగిరిధర్ – మృదంగం, ఎస్వి. రమణి – ఘటం, ప్రవీణ్ – తబలా వాద్య సహకారం అందిస్తున్నారు.













