కేసీఆర్ కు దమ్ముంటే.. ఒవైసీ, ఈటలపై : డీకే అరుణ
సీఎం కేసీఆర్‌కు మళ్లీ అవకాశం ఇస్తే తెలంగాణను మింగేస్తారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఘాటూ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌కు దమ్ముంటే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై పోటీ చేయాలని సవాల్ విసిరారు. బీసీ బిడ్డ గంప గోవర్ధన్‌ను పక్కన పెట్టి కేసీఆర్ పోటీ చేయడం దుర్మార్గమని విమర్శించారు. ఓడిపోతాననే భయంతోనే కేసీఆర్ రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాల్లోకి రావాలని ఆశ ఉన్న అధికారులు సీఎం కాళ్లు మొక్కడం సిగ్గుచేటన్నారు. రాజకీయ ఆకాంక్ష ఉంటే పదవులకు రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావాలని హితవు పలికారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంతో బీజేపీని అడ్డుకోవాలనే పన్నాగం పన్నుతున్నారని ఆరోపించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటూ పోరాడుతున్న కవిత, బీఆర్ఎస్లో మహిళలకు 3 శాతం సీట్లే కల్పించడాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.













