సూర్యాపేట కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో అపశ్రుతి… 100 మందికి గాయాలు
నల్లగొండ జిల్లా సూర్యాపేట కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో అపశ్రుతి దొర్లింది. మైదానంలో ఏర్పాటు చేసిన గ్యాలరీ హఠాత్తుగా కుప్పకూలింది. దీంతో 100 మంది ప్రేక్షకులు గాయాలపాలయ్యారు. దీంట్లో 20 మంది ప్రేక్షకుల పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన జరగగానే పోలీసులు, 108 సిబ్బంది అక్కడికి చేరుకొని, క్షతగాత్రులను ఆస్పత్రి తరలించారు. అయితే గ్యాలరీలో సామర్థ్యానికి మించి ప్రేక్షకులు కూర్చోవడంతోనే ఈ ఘటన జరిగిందని కొందరు పేర్కొంటున్నారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాల క్రీడాకారులు వచ్చారు. నల్లగొండ జిల్లాలో ఎన్నడూ ఇంతటి జాతీయ స్థాయి పోటీలు జరగలేదు. ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.













