ఇటువంటి ఘటనలను విదేశాల్లో ప్రసారం చేయరు
సమాజంలో జరిగే హింసాత్మక ఘటనలకు సంబంధించిన దృశ్యాలను పదేపదే ప్రసారం చేసే విషయంలో మీడియా ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఛానళ్లు సంయమనం పాటించాలని డిజిపి మహేందర్రెడ్డి కోరారు. హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ వద్ద కులాంతార వివాహం చేసుకున్న తన కుమార్తె తోపాటు అల్లుడిపై ఓ వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా దాడిచేసిన ఘటనపై లభించిన సిసి టివి దృశ్యాలను ఛానుళ్లు అదేపనిగా ప్రసారం చేయడం తగదని తెలిపారు. దీనివల్ల సమాజంలో హింసాత్మక ధోరణులు పెరిగే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. ఇటువంటి చర్యలు కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ చట్టం 1995ను ఉల్లం ఘించడమే అవుతుందని తెలిపారు హింసాత్మక ఘటనలు జరిగినప్పుడు మీడియా సంయమనం పాటించాలని, ఇటువంటి ఘటనలను ప్రసారం చేసే సమయంలో సామాజిక బాధ్యతతో మెలగాలని ఆయన కోరారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు టివి చాన్లలో పదేపదే రావడంపై నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తీవ్ర ఆవేదన చెందారు. విదేశాల్లో ఇటువంటి ఘటనలకు సంబంధించిన దృశ్యాలు టివి ఛానళ్లలో ఎంతమాత్రం ప్రసారం చేయరని ఆయన గుర్తు చేశారు.













