దేవీప్రియ బహుముఖ ఆవిష్కరణ
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం, భాషపై సంపూర్ణ పట్టు సాధించడంలో దేవీప్రియ సఫలురయ్యారని శాసన మండలి సభ్యుడు, ప్రభుత్వ విఫ్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. దేవీ ప్రియ రచించిన కవిత్వం, పత్రికా రచన, వ్యక్తిత్వ విశ్లేషణల సమాహారం బహుముఖ ను ప్రముఖులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి మాట్లాడుతూ నిబద్ధతతోనే ఉన్నత స్థితి సాధ్యమవుతుందన్న విషయాన్ని దేవీప్రియ బహుముఖలో ఆవిష్కరించారన్నారు. దేవీ ప్రియ సమగ్ర సాహిత్య సంకలనాలు సమాజానికి ఎంతో మేలు చేస్తాయన్నారు. ప్రముఖ స్త్రీవాద రచయిత ఓల్గా మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో స్త్రీ, పురుష స్నేహ బంధాన్ని కాపాడుకోవడం నిబద్ధతతోనే సాధ్యమవుతుందని దేవీప్రియ నిరూపించారన్నారు. కుల, మత ప్రాంత భావాలకు దూరంగా కేవలం మానవతా దృక్పథంలో ఎల్లలు లేని సమాజ ఉన్నతి కోసం ఆయన కృషి చేశారన్నారు.
సీనియర్ జర్నలిస్టు కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ మానవతా విలువలతో ఎల్లలు లేని రచనా ఒరవడిని సృష్టించడం కేవలం దేవీప్రియకే సాధ్యమైందన్నారు. ప్రముఖ కవి శివారెడ్డి మాట్లాడుతూ విశాల దృక్పథం, స్వతంత్య్ర భావాలతోనే విడదీయరాని ఎన్నో మానవ సంబంధాలను ఏకం చేసేలా దేవీ ప్రియ రచనలు సమాజానికి అందుతున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో సాహితీవేత్త ఎన్.వేణుగోపాల్, బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణ, కవి నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.













