ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తాం : భట్టి

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తుందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ఐదేళ్లు కాలయాపన చేసిన బీఆర్‌ఎస్ నేతలు మమ్మల్ని రుణమాఫీ ఎప్పుడు చేస్తారని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది. రైతు భరోసా మొత్తంతో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ప్రజలు కట్టిన పన్నులు ఎక్కడా వృథాగా పోకూడదనే ప్రతి పైసా జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నాం. రైతు భరోసా పై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీలో మా సొంత నిర్ణయాలు ఉండవు. అన్ని జిల్లాల్లో ప్రజలందరితో చర్చించిన తర్వాత ఓ నివేదిక తయారు చేస్తాం. దానిపై అసెంబ్లీలో చర్చ పెట్టి తర్వాత విధివిధానాల ఖరారు ఉంటుంది. సంపద సృష్టించి ప్రజలకు పంచాలన్నదే మా ఆలోచన. రైతులు, పన్ను చెల్లింపుదారులు, మీడియా మిత్రులతో మాట్లాడి దీనిపై నిర్ణయం తీసుకుంటాం అని తెలిపారు.