వారితోనే పార్టీకి తీవ్ర నష్టం… సమయం వచ్చినప్పుడు : రాజనర్సింహ
పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లకి న్యాయం జరగడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హైకమాండ్‌ను గౌరవిస్తామని, కానీ ఆత్మగౌరవాన్ని మించింది ప్రపంచంలో ఏదీ లేదని అన్నారు. పార్టీ పదవుల విషయంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు అన్యాయం జరిగిదన్నారు. రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర విజయవంతంగా జరిగింది. కోవర్టులు ఉండటం వల్లే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోంది. వారికి పార్టీలో అగ్రనేతలు ఎందుకు మద్దతుగా ఉంటున్నారు? కోవర్టులని తెలిపే ఆధారాలు ఉన్నాయి. అవి కూడా చూపించాం. సమయం వచ్చినప్పుడు ఆ పేర్లు బయటపెడతాం. పదువలు ఇవ్వొద్దని మేం అనడం లేదు. ఇచ్చేవాళ్లకి అర్హత ఉందో లేదో విశ్లేషణ, అధ్యయనం చేశాక ఇవ్వాలని మాత్రమే చెప్తున్నాం అన్నారు. పదవులు ఉన్నా లేకున్నా ఆత్మగౌరవంతో బతుకుతాం. కాంగ్రెస్‌లో ప్రక్షాళన జరగాలి. లేకపోతే భవిష్యత్‌లో నష్టపోవాల్సి వస్తుంది. నిరుత్సాహ పరిచేందుకు ఇలా మాట్లాడటం లేదు. ఇవి వాస్తవాలు, ఎన్నికలకు ఏడాది సమయం ఉంది. కాంగ్రెస్ కార్యక్రర్తలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.













