వారికి దండం పెడుతున్నా .. ఇటువైపు రావొద్దు
తాను కాంగ్రెస్‌లో చేరినట్లు వస్తున్న వార్తలను సీనియర్ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) ఖండించారు. తనను వివాదాల్లోకి లాగొద్దని అన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. నిన్న నా కుమారుడు సంజయ్ కాంగ్రెస్‌లో చేరారు. సంజయ్‌తో పాటు నేను కూడా గాంధీ భవన్‌కు వెళ్లాను. నాకు కూడా కండువా కప్పి పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం చేశారు. ఒకవేళ నేను కాంగ్రెస్‌లో చేరినట్టు భావిస్తే రాజీనామా చేస్తాను అని డీఎస్ పేర్కొన్నారు. వయసురీత్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. తన లేఖలో భార్య విజయలక్ష్మీని సాక్షిగా పేర్కొన్నారు. డీఎస్ గతంలో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారని భార్య విజయలక్ష్మీ తెలిపారు. ఈ మేరకు రాజీనామా లేఖను మీడియాకు చూపించారు. రాజకీయాల కోసం డీఎస్‌ను వాడుకోవద్దు. డీఎస్‌కు ఇప్పటికే ఒకసారి బ్రెయిన్‌స్ట్రోక్ వచ్చింది. కాంగ్రెస్ వారికి చేతులు జోడించి దండం పెడుతున్నా. కాంగ్రెస్ వారు ఇటువైపు రావొద్దు. డీఎస్‌ను కొంచెం ప్రశాంతంగా బతకనివ్వండి అని విజయలక్ష్మీ అన్నారు.













