నేను పార్టీకి రాజీనామ చేయను… సస్పెండ్ చేయండి
తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో క్రమశిక్షణకు మారుపేరుగా బతికానని టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ అన్నారు. నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీకి మోసం చేయడం, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటం తనకు తెలియని పని అన్నారు. తెలంగాణ పట్ల తనకున్న ప్రేమ, నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరన్నారు. కొందరు తనపై లేనిపోని నిందలు మోపి పార్టీ వ్యతిరేకిగా ముద్ర వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కొందరు పనిగట్టుకుని తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దీనిలో భాగంగానే తన కుటుంబాన్ని రోడ్డుపైకి ఈడ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి తన కుమారుడు సంజయ్‌పై కేసు పెట్టించారని ఆరోపించారు. తన మరో కుమారుడు అరవింద్ బీజేపీలో చేరిన విషయంలో తన ప్రమేయం ఏదీ లేదని సృష్టం చేశారు. తాను ఎప్పుడూ బీజేపీకి అనుకూలంగా మాట్లాడలేదని, తన సహచరులను కూడా బీజేపీలోకి వెళ్లాలని ప్రోత్సహించలేదన్నారు. ఇదే విషయాన్ని కేసీఆర్‌కు రెండుసార్లు చెప్పినట్లు తెలిపారు. తాను పార్టీలో ఉండటం జిల్లా నేతలకు ఇష్టం లేకపోతే సస్పెండ్ చేయించాలని, అది వీలుకాకపోతే తనపై పెట్టిన తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. నేను టీఆర్ఎస్ను వదిలి వెళితే మీరు చేసిన ఆరోపణలు నిజమని ఒప్పుకున్నట్లువుతుందని, నాకు నేనుగా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయనని సృష్టం చేశారు. డీఎస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ రెండు నెలల క్రితం ఎంపీ కవితతో పాటు, జిల్లా నేతలు తీర్మానం చేశారు. తీర్మానం కాపీని పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపిన విషయం తెలిసిందే.













